ఐదురాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, వెస్ట్ బెంగాల్. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి ప్రభావం చూపబోతోంది? కమలదళానికి ఉన్న విజయావకాశం ఎంత? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
ప్రధానంగా.. అసోం, వెస్ట్ బెంగాల్ పై దృష్టి పెట్టింది బీజేపీ. అసోంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. తిరిగి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంది కమలదళం. అయితే.. ఎన్నార్సీ అంశం ఏమైనా ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి. ఇక, బెంగాల్లో పరిస్థితి హోరాహోరీగా ఉంది. అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ. మమతకు పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నువ్వా? నేనా? అన్నట్టుగా పరిస్థితి. మరి, బీజేపీ ఎలాంటి ఫలితాలు నమోదు చేస్తుందో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇక, తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత అక్కడ పాగా వేయాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రజనీకాంత్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నించింది. కానీ.. ఆయన విముఖత వ్యక్తం చేశారు. దీంతో.. శశికళను రంగంలోకి దించారనే వాదన ఉంది. ఇందుకోసమే జైలు నుంచి రిలీజ్ చేశారనే ప్రచారమూ జరుగుతోంది. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో పార్టీని శశికళకు అప్పగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా ఉంది.
ఇక, కేరళలో పరిస్థితి గమనిస్తే.. పట్టు పెంచుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటోంది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ బీజేపీలోకి చేరికకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు పరుగుల రాణి పీటీ ఉష కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. సాగు చట్టాలకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు పీటీ ఉష. ఇక, పుదుచ్చేరిలో తాజా పరిణామాలు తెలిసిందే. ఇక్కడ అధికారం స్థాపిస్తామని మోడీ ధీమా వ్యక్తంచేశారు. కానీ.. పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.