అధికార టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ నిలబడుతోంది. కాంగ్రెస్ శక్తియుక్తులు కూడగట్టుకుంటున్న వేళ అనూహ్యంగా ఏపీ నుంచి సీఎం జగన్ చెల్లెలు షర్మిల దూసుకొచ్చారు. అందరితో సమావేశం అవుతూ కాకపుట్టిస్తున్నారు. తాజాగా ఆమె వ్యూహాలు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన షర్మిలకు తెలంగాణ యువత ఎందుకు మద్దతిస్తోంది..? ఇన్నాళ్లు కేవలం ఆత్మీయ సమావేశాలు అని చెప్పిన ఆమె ఇక పార్టీ పెట్టనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన వైఎస్ షర్మిల కొన్ని ఆసక్తి కర కామెంట్లు చేశారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ యువత ఆమె వైపే ఉన్నారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ముఖ్యమంత్రి పీటంపై కూర్చున్న కేసీఆర్ రైతులకు ప్రాధాన్యం ఇచ్చారు. వారి కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెడుతూ వారిని అక్కున చేర్చుకున్నారు. ఇక వృద్ధులకు డబుల్ పింఛన్లు ఇస్తూ వారికి ఆరాధ్య దేవుడిగా నిలిచారు. మరోవైపు తన పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ మంత్రి పదవులను కట్టబెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదట్లో వారు ఊహించని పిట్మెంట్ ఇచ్చి వారి చేత పాలాభిషేకాలు చేయించుకున్నారు. కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసి పేదల దైవం అని పేరు తెచ్చుకున్నాడు.